27, సెప్టెంబరు 2025 శనివారము || ఖర్జూర వృక్షము వలె ఎదుగుము
- Honey Drops for Every Soul

- Sep 27
- 1 min read
తేనెధారలు చదువుము : రోమా 3:19-26
‘‘నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు....’’ - కీర్తన 92:12
ఈ దిన వాక్యభాగము రెండు వృక్షాలను గూర్చి చెప్పుచున్నది` ఒకటి ఖర్జూర వృక్షము, మరొకటి దేవదారు వృక్షము. నీతిమంతులు ఈ చెట్లవలె వర్ధిల్లుదురని చెప్పుచున్నది. ఎవరైనను తనంతట తానే నీతిమంతుడు కాడు. మన నీతి అంతయు మురికి గుడ్డల వంటిది. (యెషయా 64:6) ‘‘నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు.’’ ‘‘అందరును పాపము చేసి దేవుడనుగ్రహించి మహిమను పొందలేకపోవుచున్నారు’’ అని రోమా 3:10 చెప్పుచున్నది. అయితే మనమెలా నీతిమంతులమగుదుము ‘‘...ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నాము’’. (రోమా 3:23,24) కాబట్టి మనము దేవుని కృప చేతనే నీతిమంతులుగా చేయబడితిమి.
ప్రియ మిత్రులారా, మునుపు చీకటిలోను, పాపములోను ఉండిన మనలను వెదకి రక్షించుటకే క్రీస్తుయేసు వచ్చెను. ఆయన మనలను రక్షించి, నీతిమంతులుగా చేసెను. కానీ అంతే సరిపోదు. ఆత్మీయంగా దినదినము మనము ఎదుగుచు ఉండవలెను. ఖర్జూర వృక్షము వలె ఎదగవలెనని నీతిమంతుని ఎందుకు పోల్చెను ? ఖర్జూర వృక్ష ఎదుగుదల ప్రత్యేకమైనది. ఎదుగుటకు అనుకూల పరిసితులు లేనప్పటికిని అది ఎదుగుచుండును. దాని ఆకులు ఎండి రాలిపోయినను అది కొత్త చిగుళ్ళు పుట్టించును. దాని వేర్లు బలహీనముగా ఉన్నను అవి లోతుకు వెళ్ళి, విశాలంగా వ్యాపించి నేలలో పట్టు కలిగించుకొనును. కరువు లేక నీరు లేని కాలంలోను అది ఎదగకుండ ఆగిపోదు. అందుచేతనే తుపానులోను అది పెకిలింపబడదు. నీతిమంతులుగా తీర్చబడిన మనము కూడ మన ఆత్మీయ జీవితంలో ఖర్జూర వృక్షముల వలె ఉందము. మన పరిస్ధితులు ఎంత అధ్వానముగా ఉన్నను ప్రభువు నందు మనము బలముగా వేరుపారియుంటే మనమేమాత్రమును కదిలింపబడక ఎదుగుచు ఉందుము. ఎండిన ఎడారి లాంటి మన బ్రతుకులోను దేవుఏడు అనుదినము మనలను వర్ధిల చేసి, మన అవసరతలన్నియు తీర్చి తృప్తిపరుచును.ప్రార్ధన:` ప్రియప్రభువా, మునుపు పాపినైయున్న నన్ను యేసుప్రభుని రక్తము చేత కడిగి నీతిమంతునిగా చేసితివి. అది నీ కృపచేతనే గనుక కృతజ్ఞతలు దేవా. అయితే నా ఆత్మీయ ఎదుగుదల ఆగిపోక, తుపాను వంటి పరిస్ధితితోను నీలో వేరుపారి ఎదుగుచు ఉండు కృప ననుగ్రహించుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రి. ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177




Comments