26, సెప్టెంబరు 2025 శుక్రవారము || భయపడకుము! దేవుడే నీ కాపరి!
- Honey Drops for Every Soul

- Sep 26
- 1 min read
తేనెధారలు చదువుము : కీర్తన 23:1-6
‘‘యెహోవా నా కాపరి...’’ - కీర్తన 23:1
మనందరికి రకరకాల భయాలుండును. కీర్తన 23 మన ప్రతి భయమును పారద్రోలి సమాధనమిచ్చు అద్భుతమైన కీర్తన. పేదరికమును గూర్చి భయపడుచు ఉంటే మంచి కాపరిగా దేవుడు మనలను పోషించి, లేమి కలుగకుండ చేయును. మనము అలసి సొలసి, ఆశ లేనప్పుడు ఆయన మనకు విశ్రాంతినిచ్చి, పచ్చికగల చోట్ల పరుండ చేయును. అది మనకు సురక్షితమైన ప్రదేశము కూడా. మనకు దిశ తప్పినట్లయితే మంచి కాపరి తానే మనలను నడిపించును. ఆయన ముందర నడచి మనలను శాంతికరమైన జలముల యొద్దకు నడిపించును. శాంతికరమైన జలములంటే సేద దీర్చు ప్రదేశాలు. అది మనకు ప్రశాంతతను, నెమ్మదిని కలిగించి మన చింతలనుండి విడిపించును. ఆయన మన ఆత్మలను లేవనెత్తి, ఉజ్జీవింపచేయును. మనము రాజీపడు పరిస్థితిలో ఉన్నప్పుడు మన గొప్ప కాపరి మనకు బలమిచ్చును. ఆయన తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించును. గాడాంధకార లోయలో సంచరించుచు ఒంటరిగా ఉన్నప్పుడు మన సాత్వికమైన కాపరి మనకు ధైర్యమునిచ్చును. ఆయన మనకు తోడుగా ఉండి ఆదరించును. ఆయన దుడ్డు కఱ్ఱ, ఆయన దండముతో మనలను కాపాడి తోడుగా నుండును. మనము అవమానించబడినప్పుడు ప్రేమగల కాపరి ఘనతనిచ్చును. ఆయన మన తలను నూనెతో అభిషేకించును. మరియు మన శత్రువుల ఎదుట మనలను హెచ్చరించును. నిశ్చయముగా మన బ్రతుకు కాలమంతయు కృపాక్షేమములే మన వెంట వచ్చును. ఆయన మనకు రక్షణ, నిత్యజీవము ననుగ్రహించును. చిరకాలము మనము యెహోవా మందిరములు నివాసము చేసెదము.
ప్రియస్నేహితులారా, అయితే మనమెందుకు భయపడవలెను ? ఎంతో మృదువైన మన కాపరిని వెంబడిరచుచు పరిపూర్ణముగా ఆయన అధికారమునకు ఒప్పుకొందము.ప్రార్ధన:` సర్వశక్తి గల దేవా, ఇంకను నీకు లోబడని విషయాలు నాలో కొన్ని ఉన్నవి. వాటిని ఇప్పుడే నీకు లోబరుచుచున్నాను. నీ సర్వాధికారములో నీ ప్రేమ, ఆప్యాయతలలో స్వేచ్ఛ, సంతోషాల ననుభవించు కృపనిమ్మని యేసు అమూల్యమైన నామములో ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177




Comments