18, నవంబర్ 2024 సోమవారము || తేనెధారలు
- Honey Drops for Every Soul
- Nov 18, 2024
- 2 min read
చదువుము : మత్తయి 18:21-25
దయ కలిగి క్షమించుదము
‘‘... క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి’’- ఎఫెసి 4:32
రెండవ ప్రపంచ యుద్ధము ముగిసిన తరువాత 10 సం॥ల తరువాత ఇద్దరు శాంతి దూతలైన క్రైస్తవులు కొందరు పోలండు దేశపు వారిని దర్శించి ‘‘మీరు పశ్చిమ జర్మనీలోని ఇతర క్రైస్తవులను కలిసికొనుటకు ఇష్టపడుచున్నారా ?’’ అని అడిగిరి. అప్పుడు వారు అడిగినదేమంటే ‘‘జర్మనీవారు యుద్ధ సమయంలో తమకు చేసిన దానిని బట్టి క్షమాపణ కోరి, అప్పుడు నూతనముగా సంబంధాలు నెలకొల్పుకొనవలెను అని ఉన్నారు’’ మొదట ఒక పోలీష్ వ్యక్తి ఒకరు ఇలా అన్నాడు. ‘‘మీరు అడుగునది అసాధ్యము. మేము వారిని క్షమించలేము.’’ తరువాత వారు ఎవరి దారిన వారు వెళ్ళునప్పుడు ఏలాగైనను పరలోక ప్రార్థన కలిసి చేసిరి. ‘‘మా ఋణస్థులనుమేము క్షమించిన ప్రకారము మా ఋణములను క్షమించుము’’ అని చెప్పునప్పుడు ప్రతి ఒక్కరు ప్రార్థించుట ఆపివేసిరి. ఆ గది అంతయు ఒక కలవరముతో నిండెను. అప్పుడు ఆ పోలాండు దేశస్థుడు కఠినంగా సమాధానమిచ్చి నందుకు బాధపడి, ఉద్వేగముతో ‘‘మీరు చెప్పిన దానికి నేను సరేయని చెప్పవలసియుండెను. ఇక మీదట ప్రభువు ప్రార్థన నేను చేయలేను. క్షమించలేకపోతే ఇక నేను క్రైస్తవుడను కాను. మానవ రీతిగా నేనది చేయలేను, కానీ దేవుడే మనకు ఆ శక్తినిచ్చును’’ అని చెప్పెను. 18 నెలల తరువాత ఇరు దేశస్థుల క్రైస్తవులు వియన్నాలో కలిసికొని స్నేహము కలుపుకొని, ఇప్పటికి కూడా కొనసాగుచున్నారు. (మూలము : వాట్ ఈజ్ సో అమేజింగ్ అబౌట్ గ్రేస్ ? రచయిత : ఫిలిప్ యాన్సీగారు)
ప్రియ మిత్రులారా, తరచుగానే మనము రోజుకు ఒకసారో లేక వారానికి ఒకసారి సంఘ ఆరాధనలో ప్రభువు ప్రార్థన చేస్తూనే ఉంటాము. మనము కూడా, మాయెడ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము’’ అని చెప్పుచుందుము. అయితే మనము నిజంగానే క్షమించితిమా ? ఎంత విచారకరము. చిన్న విషయాలలోను మనలను బాధపరచిన వారి ఎడల ద్వేషము పెంచుకొందుము. కానీ మనలను బాధించిన వారిని ఎట్టి షరతులు లేకుండా క్షమించవలెనని దేవుడు కోరుచున్నాడని గుర్తుంచుకొందము. ఏ భేదము లేకుండానే క్షమించవలెనని ప్రభువు మనలకు చెప్పెను. ఎవరైనను మనలను ఎడతెగక బాధించుచున్నను పగ తీర్చుకొనక ఆ విషయం దేవుని చేతిలో పెట్టుదము. నిజానికది చాలా క్లిష్టమైనదే, అయినను ఇతరుల తప్పుడు క్షమించుటకు మాత్రమే కాక వాటిని మరచిపోవుటకు శక్తినిచ్చు పరిశుద్ధాత్మ మీద ఆనుకొంటే ఆయన సాయం చేయును.
ప్రార్ధన :- ప్రేమగల పరలోక తండ్రీ, నన్ను అవమానపరచిన దానిని క్షమించుట కష్టముగా ఉన్నప్పుడు నీవెంత ధారాళంగా నన్ను క్షమించి, నీకు విరోధంగా పాపము చేయునప్పుడును క్షమించుచున్నావని గుర్తుంచుకొనుటకును, ఈ విషయంలో నిన్నే అనుసరించు కృపనిమ్మని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.
Office: +91 9444456177 || https://www.honeydropsonline.co
Comments