14, సెప్టెంబరు 2025 ఆదివారము || దేవుని వాక్యము బలమొంది ఎదుగుట కొక టానిక్
- Honey Drops for Every Soul

- Sep 14
- 2 min read
తేనెధారలు చదువుము : కీర్తన 1:1-6
‘‘కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను ఆపేక్షించుడి.’’ - 1 పేతురు 2:2
సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త ధూషణ మాటలును మానివేయవలెనని మనకు పేతురు చెప్పుచున్నాడు. ‘‘మత్సరము ఎముకలకు కుళ్ళు’’ అని సామె 14:30 చెప్పుచున్నది. యాకోబు అంటున్నాడు. ‘‘మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు, ప్రతి నీచకార్యమును ఉండును’’. (యాకోబు 3:16) మత్సరము అనునది ఆత్మకు పట్టిన భయంకరమైన రోగము. దానిని సమూలంగా ధ్వంసము చేయనిదే మన ఎన్నటికి ఆత్మీయంగా ఎదగలేము. గలతీ 5:21లో అసూయ ఉన్నవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని పౌలు హెచ్చరించుచున్నాడు. తరువాత కొండెములాడుట. లేవీకౌం 19:16లో దేవుడు ‘‘నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు’’ అని ఇశ్రాయేలులకాజ్ఞాపించెను. సామె 10:18 చెప్పుచున్నదేమనగా, ‘‘కొండెము ప్రచారము చేయువాడు బుద్ధిహీనుడు.’’ యాకోబు 4:11,12లో ‘‘ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి... పరునికి తీర్పుతీర్చుటకు నీవెవడవు?’’ అని చెప్పబడినది. మిర్యాము తన సొంత సహోదరునికి విరోధంగా మాట్లాడినందువలన తీవ్రమైన ప్రతిఫలము నెదుర్కొనవలసివచ్చెనని మనము చదువుదుము. (సంఖ్య కాం.12) దేవుడు కోపము ఆమెపై రగులుకొనెను. కుష్ఠురోగముతో ఆయన ఆమెను మొత్తెను.
ప్రియ స్నేహితులారా, ఇవ్వని పాత పాప పురుషునికి చెందినవి గనుక వాటిని మానివేయవలెనని బైబిలు ఖచ్చితంగా చెప్పుచున్నది. ఇవన్నియు ఈ లోకస్తులలో ఉండు లక్షణాలు. (1కోరింధీ 3:3) పాపస్వభావపు క్రియలు. గలతీ (5:19) వీటిని కలిగియుండుట బదులుగా మన మనస్సులను దేవుని వాక్యముతో నింపుకొనవలెనని పేతురు చెప్పుచున్నాడు. నూతనముగా జన్మించిన శిశువు ఆకలిగొనినప్పుడు పాలకొరకు ప్రాకులాడు మీరెన్నడైన చూచితిరా ? పాలిచ్చు వరకు ఆ శిశువు వేరొక దానిపై ధ్యాస ఉంచదు, బుజ్జగించినను ఊరుకొనదు. ఆ విధంగా మనము దేవుని వాక్యము కొరకు ఆకలి కలిగియుండవలెనని పేతురు మనకు చెప్పుచున్నాడు. 119వ కీర్తనలో కీర్తనాకారుడు దేవుని వాక్యము పట్ల తనకున్న అత్యాసక్తిని వెల్లడి చేసెను. ఆది దాదాపు 174 వచనాలలో ధర్మశాస్త్రము, కట్టడలు, నియమాలు, దేవుని ఆజ్ఞలు మొ॥ వాటిని గూర్చి చెప్పబడినది. మనకు వీలైనంత తరుచుగా దేవుని వాక్యమును మనము చదువుదుము. అన్నిటిని మించి ఆ వాక్యమేమి చెప్పుచున్నదో దానిని మన జీవితములో ఆచరించి, గైకొందము.
ప్రార్ధన: ప్రియప్రభువా, నా మనస్సు చెడ్డ తలంపులతో కలుషితము కాకుండ, నీ వాక్యముతో దానిని నింపుకొనుటకు సహాయుము చేయుము. పాపము యొక్క హానికరమైన ప్రభావము చేత బలహీనమై, కృశించిన నా ఆత్మను బలపరుచుము. నీ శక్తి గల వాక్యము చేత అనుదినము నా అంతరంగ పురుషుడు బలపరచబడు కృపనిమ్మని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రి ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177




Comments