10, నవంబర్ 2024 ఆదివారము || తేనెధారలు
- Honey Drops for Every Soul
- Nov 10, 2024
- 1 min read
చదువుము : లూకా 14:1-6
ఎల్లవేళల కనిపెట్టబడుచుందుము
‘‘ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టుచుండిరి’’ (లూకా 14:1)
ఈ లోకంలో ప్రభువు పరిచర్య చేసిన కాలమంతయు ఆయన విరోధులు ఒక గ్రద్ద తన ఎర కొరకు చూచినట్లే ఆయనను కనిపెట్టుచునేయుండిరి. వారి చెడ్డ కళ్ళు ఆయనను పరిశీలించుచునేయుండెను. ఏదో ఒక మాటలోగానీ, క్రియలోగానీ ఇరికించి అపనింద వేయుటకు ఉత్సుకత చూపుచుండిరి, గానీ ఏ తప్పు కనుగొనలేకపోయిరి. మన ప్రభువు పరిశుద్ధుడు, మచ్చ, డాగులేనివాడు. బద్ధ శత్రువు కూడా ఏ దోషము, మచ్చలేని పరిపూర్ణ జీవితం జీవించిన దేవుడాయన. ‘‘క్రీస్తు ప్రభువును సేవించవలెననుకొను వారెవరైనను తన ప్రభువుకంటె తక్కువగా ఉండకయు, ఈ లోకపు కళ్ళన్నియు అతనినే పరిశీలించుననియు, దుష్టుల దృష్టి తమ మార్గాలన్నిటిలో ఖచ్చితముగా ఉండునని మరువరాదు’’ అని జె.సి. రైల్గారు వ్రాసిరి. మరియు ప్రత్యేకించి రక్షింపబడని వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్త కలిగియుండవలెను. మాటలో కానీ, క్రియలో కానీ ఏ చిన్న పొరపాటు చేసినను ఎప్పటికి దానిని వారు మరువక ఎత్తిచూపుచుందురనియు గుర్తుంచుకొనవలెను.

ప్రియ మిత్రులారా, ‘‘యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని, మంచివారిని అవి చూచుచుండును’’ (సామె 15:3). పరిశుద్ధుడైన దేవుని దృష్టిలో అనుదినము పరిశుద్ధంగా జీవించుటకు ప్రయాసపడుదము. ఆలాగున జీవించుచున్నట్లయితే ఈ దుష్టలోకమెంతగా కనిపెట్టి చూచినను మనము దొరకయు, దాని 6:5 చదివితే ‘‘అతని దేవుని పద్ధతి విషయమందే గానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేము’’ అని దానియేలు యొక్క శత్రువులు ఒప్పుకొనక తప్పలేదు. దేవునికి, మనుష్యులకు విరోధముగా ఉండని మంచి మనస్సాక్షి కలిగి దేవుని విరోధులైన వారు నిందించుటకు అవకాశమియ్యకుండ మనము జీవించుదము. సమస్త విషయాలలోను యేసువలె బ్రదుకుటకు దేవుడు మనలను బలపరచును గాక.
ప్రార్ధన :- పరిశుద్ధుడవైన ప్రభువా, నా ఇరుగు పొరుగువారు, నా సహోద్యోగులు సెలవులలోను మొ॥ రక్షింపబడని ఈ లోకస్థులు ఎల్లవేళల నన్ను కనిపెట్టుచుందురు గనుక నీవలె నీ శత్రువులకేమాత్రము నిందించుట కవకాశమియ్యక జీవించునట్లు నీ ఆత్మతో నన్ను బలపరచుమని యేసునామమున ప్రార్ధించుచున్నాఉ తండ్రీ. ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.
Office: +91 9444456177 || https://www.honeydropsonline.com
Commentaires