09, జూలై 2025 బుధవారము || సిలువలో యేసుప్రభువుతో నేను సిలువ వేయబడియున్నాను
- Honey Drops for Every Soul

- Jul 9
- 1 min read
తేనెధారలు చదువుము : ఎఫెసీ 2:5-6
‘‘నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడియున్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు’’ - గలతీ 2:20
ఈ వచనములోని ‘‘నేను’’ అనునది ‘‘పాత స్వభావము’’ చెడ్డదైన ‘‘నేను’’ సిలువ వేయబడినందున దానికి మనమీద ఏ ప్రభుత్వము లేదు, ఎందుకనగా మనము ఇకమీదట ఆదామునందు లేము కానీ క్రీస్తునందున్నాము. దేవుని ఎదుట ఇదియే ఇప్పుడు మన నూతన స్థితి మరియు అది మన అనుదిన ఆచరణలో కనబడవలెను. ‘‘క్రీస్తుతో కూడా సిలువ వేయబడుట’’ అనగా నాశనకరమైన మన స్వభావాలైన తిరుగుబాటుతనము, పగ, కోపము, స్వార్థము మొ॥నవన్నియు క్రీస్తుతో కూడా సిలువవేయబడినవి. క్రీస్తుప్రభువు విజయమందు మూడవ దినమున తిరిగి లేచినట్లే మనము నూతనముగా జీవించుటకు తిరిగి లేచుదుము (రోమా 6:4). ‘‘జీవించువాడను ఇక నేను కాదు కానీ క్రీస్తే నాయందు జీవించుచున్నాడు గనుక నేను నూతన సృష్టిని’’ అని దీనిని మనము ఎల్లప్పుడు గుర్తు పెట్టుకొనవలసిన అవసరమున్నది. పరిశుద్ధ అగస్టీన్‌గారు తన పాపమును గూర్చి పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడినప్పుడు యేసుప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించెను. అతడు ఎంతో మార్పుచెందిన వ్యక్తిగా పూర్తిగా వ్యత్యాసమైన వ్యక్తిగా మారిపోయెను. ఒకదినాన అతడు వీధిలో నడుచుచు వెళ్ళుచుండగా తన పాత స్నేహితులారా ‘‘అగస్టీన్, ఇదిగో నేను !’’ అని పిలవనారంభించెను. గతములో చెడుగా స్నేహము చేసిన ఆ అవమానకరమైన వ్యక్తివైపు చూచి ఇప్పుడు తనకు క్రీస్తునందున్న నూతన స్థితిని గుర్తు చేసికొని ‘‘ఇది నేను కాను’’ అని గట్టిగా కేక వేసి త్వరగా పారిపోయెను. ‘‘ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించు చున్నాడు’’ అను గలతీ 2:20లో ఉన్న వాక్యమును అగస్టీన్ తన హృదయములో దాచుకొనెను.
ప్రియ స్నేహితులారా ! అనుదినము దేవుని సన్నిధికి వచ్చి మన పాపమంతయు సిలువలో మేకులతో కొట్టబడెనని మనము నిశ్చయముగా ఒప్పుకొనవలసియున్నది. శ్రమలు, శోధనలు మన మనసుపై దాడిచేసి ఒకప్పుడు మనము ఆదామునందున్నప్పుడు నడిచి నాశనకరమైన మార్గములోనికి నెట్టివేయుటకు ప్రయత్నించుచుండును గనుక దినమెల్ల క్షణక్షణము మన జీవితాలను క్రీస్తు ప్రభువునకు సమర్పించుకొనుచుండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది.ప్రార్ధన:- ప్రియ ప్రభువా, నేను జీవించుచున్నాను అనగా ఈ లోకాశలతో జీవించిన పాత ‘‘నేను’’ కాదు అని ‘‘క్రీస్తే నాలో జీవించుచున్నాడు’’. నేను ఒక నూతన సృష్టిని అనియు, పాత స్వభావము ‘‘మరణించి’’ నూతన ‘‘నేను’’ క్రీస్తునందు ‘‘లేచెను’’ అనియు ఎల్లప్పుడును మనసునందుంచుకొను కృపనిమ్మని యేసు నామమున వేడుచున్నాను. తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com




Comments