top of page

08, జూలై 2025 మంగళవారము || నూతన జీవితము ! నూతన జీవ మార్గము !

  • Writer: Premalatha John
    Premalatha John
  • Jul 8
  • 2 min read

తేనెధారలు చదువుము : కార్య 9:1-6



‘‘అతడు బహుగా భయపడి, వణుకుచు, ప్రభువా నేనేమి చేయవలెనని నీవు కోరుచున్నావు? అని అడిగెను’’ - అపో.కార్య 9:6

పౌలు అనబడిన సౌలు క్రీస్తుప్రభువు మార్గమందుండిన వారిని బంధించి తెచ్చుటకు యెరూషలేములోని ప్రధాన యాజకుని నుండి పత్రిక తీసికొని దమస్కు మార్గములో వెళ్ళుచుండగా హఠాత్తుగా ఒక్క ప్రకాశమానమైన వెలుగు సౌలుమీద ప్రకాశించెను. అప్పుడతడు నేలమీద పడి ‘‘సౌలా, సౌలా నన్నేల నీవు హింసించుచున్నావు ?’’ అని పేరుపెట్టి పిలిచి అడుగు స్వరము అతనికి వినబడెను. సౌలు ఎంతో కలవరపడి ఎవరు మాట్లాడుచున్నారో అర్థంకాక ‘‘ప్రభువా నీవెవరివి ?’’ అని అడుగగా యేసు, ‘‘నేను నీవు హింసించుచున్న యేసును’’ అని జవాబిచ్చెను. ఈ మాటలు వినిన సౌలు ఆలోచనలు ఎలా ఉండినవో ఊహించుడి. ఈ భూమి మీద యేసు పరిచర్య చేసిన కాలంలో సౌలు ఆయనను చూచెనో లేదో మనకు తెలియునట్లు వ్రాయబడియుండలేదు కానీ యేసు శిష్యులు ఆయన మరణమునుండి లేచెనని చెప్పినప్పుడు అతనికి తెలిసియుండుననుటలో ఏ సందేహమును లేదు. ఇప్పుడైతే తన మాట్లాడుచున్న యేసు నిజముగా మరణము నుండి లేచెనని, ఆయన సజీవుడని నిర్ధారింపబడెను. వెనువెంటనే అతడు యేసును రక్షకునిగాను, ప్రభువుగాను గుర్తించెను. తాను హింసించుచుండిన వ్యక్తి పునరుత్థానుడైన రక్షకుడని అప్పటికప్పుడే గ్రహించెను. ఆ క్షణమందే తన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొనెను. అంతము వరకు కూడా అతడెన్నడు తన తీర్మానంలో చలించలేదు. క్రీస్తు సౌలు నెదుర్కొనుటను బట్టి అతడు ఎన్నటెన్నటికి మార్పుచెందెను. దమస్కు మార్గములో క్రీస్తును హింసించువాడిగా ఉండిన సౌలు క్రీస్తును స్తుతించువానిగా సాగిపోయెను. క్రైస్తవులకు విరోధంగా, కుట్రచేయుచుండినవాడు వారికి క్రీస్తును బోధించువానిగా అక్కడినుండి వెళ్ళెను. బానిసత్వమునుండి స్వేచ్ఛలోనికి, గ్రుడ్డితనము నుండి దృష్టి కలిగించబడి వెళ్ళెను.  ప్రియ స్నేహితులారా, మనందరికి పౌలు యొక్క మార్పు ఒక మాదిరి. రక్షించు దేవుని గొప్ప శక్తినుండి ఎవరును ఎంతో దూరము వెళ్ళలేరు అను సత్యమునకు ఇది ఒక 


ఉదాహరణ. ఒకరి జీవితాన్ని దేవుడు తన చేతులలోనికి తీసికొనినప్పుడు ఏమి చేయునో అనుదానికి ఇది ఒక ఉదాహరణ. అంతేకాదు ఎంత దుష్టుడైన పాపికొరకైనను మనము ప్రార్థించుటకు అది మనకు ధైర్యమునిచ్చుననుటకు ఒక ఉదాహరణగా ఆ సంఘటన 

ఉన్నది.


ప్రార్ధన:- ప్రియ ప్రభువా, భయంకరంగా సంఘమును హింసించిన సౌలును నీవు రక్షించినట్లయితే నీవు రక్షింపలేని వారెవరైనా ఉందురా ? ఖచ్చితంగా ఉండరు ! ఎవరినైనను అంతరంగములోనుండి మార్చి, నీవు వాడుకొనగలవు. ఎంతటి తిరుగుబాటు చేయువాడైనను అట్టి పాపికొరకు పట్టుదల కలిగి ప్రార్థించుటకు సౌలు యొక్క సంభాషణ నన్ను ప్రోత్సాహపరచునట్లు యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page