08, జూన్ 2025 ఆదివారము || యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు ! నేనెవరికి భయపడుదును ?
- Honey Drops for Every Soul

- Jun 8
- 1 min read
తేనెధారలు చదువుము : కీర్తన 27:1-3
‘నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు’’
- కీర్తన 27:3
‘‘భయపడుటకు రెండు కారణాలున్నవి. ఒకటి అపరాధ భావన. మరొకటి నమ్మకము లేకపోవుట’’ అని జాన్ మెకార్థర్గారు వ్రాసిరి. ఎవరైనా తన జీవితంలో పాపము కలిగి యున్నప్పుడు ఒకరోజు తాను పట్టబడి, శిక్షింపబడుదునని తలంచునప్పుడు అతడు భయపడును లేక రెండవదిగా, తన పరిస్థితిని దేవుడు చూచుకొనునని తలంచనివాడు భయపడును. దేవుని జ్ఞానము, శక్తి, మంచితనమునందు నమ్మికయుంచలేనప్పుడు మనము కలవరపడి, భయపడుదుము. ‘‘దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి’’ అని ఫిలిప్పీ 4:6లో మన గురి దేవుని మీదనే ఉండవలెనని పౌలు చెప్పుచున్నాడు. మనము కృతజ్ఞతా బుద్ధితో మన స్థితిగతులను దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుని నుండి కలుగు అంతరంగ సమాధానము, శాంతి మన ఆత్మకు కలుగును. (ఫిలిప్పీ 4:7). జీవన పోరాటములో భయము గుప్పిట్లో నుండి విడిపించు గొప్ప నెమ్మది కలిగించు ఆయన పరిపూర్ణ జ్ఞానము, నిత్యశక్తియందు నిశ్చయత కలిగియుండునదే ఆ సమాధానము. అంతేకాదు మన శ్రమలన్నియు మన జీవితములో దేవుని చిత్తములో భాగమైయున్నదని మనమర్ధము చేసికొనవలసిన అవసరమున్నది. మన జీవితములో అసౌకర్యము కలిగించి ప్రతి పరిస్థితిని ఏమాత్రము ప్రక్కకు పెట్టలేనిదే మన ఆచరణాత్మక క్రైస్తవ జీవితములోని గొప్ప సవాలు. కానీ సార్వభౌముడు, తెలివి, మంచితనము, శక్తిగల దేవుని యందు నమ్మికయుంచి భయము కలిగించు ప్రతి పరిస్థితిలో నెమ్మది కలిగియుండవలెను.
ప్రియ మిత్రులారా, మనము చాలా భయముతో ఉన్నామా ? కృతజ్ఞతాపూర్వకముగా దేవునిపై దృష్టియుంచుటకు సాధన చేసినట్లయితే ఆయన శాంతి సమాధానాలను మనమనుభవించగలమని గుర్తుంచుకొనుడి.ప్రార్ధన:- ప్రియ ప్రభువా, నాకు భయము కలిగినప్పుడు నీ మీదకు, నీ వివేకము, శక్తి, మంచితనముపై నేను దృష్టియుంచు కృపనిమ్ము. నేనిప్పుడున్న పరిస్థితి నీ ప్రణాళికలో భాగమేయని నేను గ్రహించితిని. గనుక చింతించక కృతజ్ఞతా హృదయముతో నీ సర్వాధికారమునకు అప్పగించుకొను కృపమనుగ్రహించుమని యేసు నామమున కృతజ్ఞతలు తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com




Comments