06, అక్టోబరు 2025 సోమవారము || నీకు క్రీస్తే పూర్తిగా ఉన్నాడా ?
- Honey Drops for Every Soul
- Oct 6
- 1 min read
తేనెధారలు చదువుము : లూకా 6:46-49
‘‘మీరు విశ్వాసము గలవారైయున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి...’’ - 2 కొరింథీ 13:5
ప్రభువైన యేసు తన వాక్యమును కేవలము వినుచుండువారినే కాక ఆయన చిత్తమును కూడా చేయువారి విశ్వాసము యొక్క విశిష్ఠమైన చిత్రమును చిత్రించును. రాతి మీద పునాది వేసి ఇల్లు కట్టువానిగా వానిని దేవుడు పోల్చెను. అలా రాతి మీద కట్టుటకు అతడు ఎంతో బాధ, శ్రమననుభవించుటయే కాక తనను తాను ఉపేక్షించుకొనును. నేలను లోతుగా త్రవ్వుట కొరకు శ్రమపడును. తన పునాదిని రాతి మీద వేయును గనుక వాని ఇల్లు గట్టి పునాది మీద కట్టబడిన ఇంటివలెనే దేవుని వాక్యమునకు విధేయుడైన మనిషి విశ్వాసము కూడా ఉండును. శ్రమల ప్రవాహాలు దానిని భీకరముగా కొట్టినను, హింసలు వరదలవలె దానిపైకి దూసుకొని వచ్చినను అది పడిపోదు. కానీ, క్రీస్తు బోధనలు వినియు వాటికి విధేయత చూపని వ్యక్తి యొక్క మత విశ్వాస చిత్రమెంత దు:ఖకరము. గట్టి పునాది లేకుండా ఇసుక మీద కట్టబడిన ఇంటితో ప్రభువతనిని పోల్చెను. ఈ ఇద్దరిలో బాహ్యంగా ఎవరు తేడా గమనించలేరు. ఇద్దరు అదే విశ్వాసమును ఒప్పుకొందురు గానీ, శ్రమ దినమున వెలిచూపుకు విశ్వాసిగా ఉన్నవాడు నిశ్చయంగా పడిపోవును. పెనుగాలి, తుపానులు ఆ యింటిని కొట్టినప్పుడు దానికి పునాది లేదు గనుక, సూర్యకాంతిలో మంచి వాతావరణంలో బయటకు చక్కగా కనబడిన దాని గోడలు అప్పుడు కూలిపోవును. దాని పాటు ఎంతో గొప్పది !
ప్రియ స్నేహితులారా, మనలను మనము ఎట్టి పునాదిపై కట్టుకొన్నాము ? మన విశ్వాసము నిజమైనదేనా ? లేక నామమాత్రమైన విశ్వాసము కాకుండా క్రీస్తునందు హృదయపూర్వకమైన నమ్మిక ఉన్నదా ? మన బ్రదుకులను మార్చిన మనకు యేసుతో నిజమైన సంబంధమున్నదా ? మన జీవిత పునాదిని పరిశీలించుకొనుమని, దినదినము ఎలా కట్టుకొనుచున్నామో చూచుకొనుమని ప్రభువు కోరుచున్నాడు. మనపై వరదలు, తుపానులు రేగి కొట్టునప్పుడు మన ఇల్లు పడిపోక నిలిచియుండునట్లు క్రీస్తుప్రభుని స్వరము విని, ఆయన ననుసరించుదము.
ప్రార్ధన:- ప్రియప్రభువా, ఇసుక మీద తన ఇల్లు కట్టుకొను బుద్ధిలేని వానివలె నేనుండకయు, కేవలము నా పెదవులతోనే నా విశ్వాసము ప్రకటించక నా బాహ్య మరియు అంతరంగ జీవిత సాక్ష్యము, భక్తి ఉండునట్లు కృపనిమ్ము. నన్ను నేను మోసపుచ్చుకొనుచు అంత్యదినాన పరీక్షలో ఓడిపోకుండా, నా ఆత్మ నశించిపోకుండా సహాయము చేయుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177
Comments