top of page

02, జూలై 2025 బుధవారము || ఊహించని సమస్య వచ్చినప్పుడు మనమెటుపోవలెను ?

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Jul 2
  • 2 min read

తేనెధారలు చదువుము : 2 దిన వృత్తాం. 20:18-26



‘‘యెహోషాపాతు భయపడి యెహోవాయొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని...’’ - 2 దిన వృత్తాం. 20:3


యూదా రాజైన యెహోషాపాతు ఒక భయంకరమైన పరిస్థితిని నెదుర్కొనెను. ఒక దినాన అతనికి మనుష్యులు కొందరు యూదాను నాశనము చేయుటకు ఒక గొప్ప సైన్యము వచ్చుచున్నదని హెచ్చరించెను. అంత గొప్ప సైన్యము యెహోషాపాతు ఏ మాత్రము ఎదుర్కొను అవకాశమే లేదు. చిన్న దేశమైన ఆ యూదారాజ్యమునకు అది ఒక మరణ దినముగా కనబడెను. అప్పుడు యెహోషాపాతు చేసినదేమిటి ? ‘‘అతడు యెహోవా యొద్ద విచారించుటకు పూనుకొని’’ ఉపవాసము ప్రకటించెను (2 దిన వృత్తాం 20:3). యూదా జనులందరు కూడుకొనినప్పుడు వారి ఎదుట యెహోషాపాతు నిలిచి, ‘‘మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా ? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు’’ అని ప్రార్థించెను. యెహోషాపాతు తన తండ్రిjైున ఆసావలె కాక దేవునికి నమ్మకస్థునిగా ఉండి సిరియా, సమరయ లేక అష్షూరు నుండి కూడా సహాయము కోరలేదు. నిబంధన చేసిన ఇశ్రాయేలు దేవుని నుండి మాత్రమే సహాయము కోరుటకు తీర్మానించుకొనెను. తనకు వ్యతిరేకంగా యుద్ధానికి వచ్చిన విరోధులపై దాడి చేయుటకు అతడు ఉపయోగించిన ఏకైక ఆయుధము అతనికి దేవుడిచ్చిన విశ్వాసమే. అయితే జరిగినదేమిటి ? ఆపదతోను భయము మరియు ఎక్కడ చూచిన కలవరముతో ఆరంభమైన ఈ అధ్యాయము సంతోష సమాధానాలు, విజయము, నెమ్మదితో ముగించబడినది. ఈ అధ్యాయంలో రెండు మాటలు ఎక్కువగా కనబడుచుండును. స్తుతి మరియు ప్రార్థన ఈ రెండు కవలల వలె ఎప్పుడును కలసి కదులుచు ఈ రెంటిని కలిపియుంచు ఒక పదము ‘‘విశ్వాసము’’.


ప్రియ మిత్రులారా, కష్టకాలములో మన ఆత్మలు ఆశ్రయము కొరకు ఎక్కడికి పరుగెత్తవలెను ? నిబంధన చేసిన మన దేవుని వద్దకే. యెహోషాపాతునకు విరోధముగా మోయాబీయులు, పెక్కుమంది శత్రువులు ఎలా లేచిరో అలాగే లోకము, శరీరము మరియు అపవాది, ఇంకను సమస్త చీకటి శక్తులు అనుదినము మన ఆత్మలకు విరోధము వచ్చుచుండును. మానవ శక్తి కూడగట్టుకొనుటకు బదులు యెహోషాపాతువలె మనము ఎడతెగక దేవునియందే ఆశ్రయము పొందుచు ఆయన బలము కొరకు చూచుచు, ఆయన కృపయందే నమ్మికయుంచుదము.

ప్రార్ధన:- ప్రియ ప్రభువా, నాకు మించిన సమస్యలనెదుర్కొనునప్పుడు కలవరపడక వాటిని ప్రార్థనలో నీ సన్నిధిని తెచ్చి నీవియ్యబోవు విజయము, విడుదల కొరకు నిన్ను స్తుతించు కృపనిమ్ము. ఏ శత్రువుకు దొరకకుండా నీ రెక్కల నీడన ఆశ్రయము పొందుదునని యేసు నామమున వేడుచున్నాను తండ్రీ, ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page