02, జూన్ 2025సోమవారము || నీ ఆలోచనలను గూర్చి జాగ్రత్తగా ఉండుము
- Honey Drops for Every Soul

- Jun 2
- 2 min read
తేనెధారలు చదువుము : సామె 4:20-27
‘నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము’’ - సామె 4:23
మన అంతరంగ జీవితమును ‘‘జాగ్రత్త చేసికొనుమని’’ లేక ‘‘కాపాడుకొనుమని’’ ఇక్కడ సొలొమోను మనలనడుగుచున్నాడు. మన హృదయంలో రహస్యంగా ఏమి జరుగుచున్నదో దానిని బట్టియే మనము కట్టబడుటయో లేక విరిగిపోవుటయో జరుగును గనుక మన హృదయమును భద్రముగా కాపాడుకొనుట ఎంతో ప్రాముఖ్యమైనది. ‘‘ఒక మనిషి ఏమి తలంచునో ఆ దినమంతయు అలాగేయుండును’’ అను ఒక సామెత ఉన్నది. ఇది ఎరిగిన అపవాది మన హృదయాలను అపవిత్రతతోను, దేవుని అవమానపరచు తలంపులు, కోరికలతోను తరచుగా నింపుటకు ప్రయత్నించుచుండును. వాటిని మన హృదయాలలో దాచియుంచుకొన్నంత కాలము అవి ఏమంత చెడ్డవి కాదులే అని ఈ చెడ్డ తలంపులు కలిగియుండునట్లు మనలను అపవాది మోసములోనే యుంచును. అయితే యేసు ‘‘హృదయములోనుండియే చెడ్డ ఆలోచనలు బయటకు వచ్చును... అదియే ఒక మనిషిని అపవిత్రపరచును’’ అని మత్తయి 15:19`20లో చెప్పెను. మనిషి యొక్క భక్తిహీనముగా తలంచు జీవితమే అతనిని పాపమార్గాలలో ముంచివేసి తుదకు దేవుని ఉగ్రతను కొనితెచ్చుకొనునని ఆది కాం. 6లో చెప్పబడినది. ‘‘... వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు 7వ వచనంలో ‘‘నేను సృజించిన నరులను... భూమి మీద ఉండకుండ తుడిచివేయుదును’’ అని దేవుడు చెప్పెను.
ప్రియ మిత్రులారా, మన మనస్సు ఒక విశాలమైన జలాశయము వంటిది. కాబట్టి మనము ఏమి చూచినను, వినినను, తలంచునదైనను ఎన్నటికి మరువబడదు కానీ, అది అక్కడ నిల్వచేయబడి ఊహించని రీతిగా కొంతకాలానికి అవి బయటకు వచ్చును. గనుక సరైన మంచి ఆలోచనలతో మన మనసులను నింపుకొనుట తప్పనిసరిగా అవసరమైయున్నది. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి అని ఫిలిప్పీ 4:8లో పౌలు మనకొక గొప్ప సూచననిచ్చుచున్నాడు. కొలస్సీ 3:16లో ‘‘క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి’’ అనియు అతడు చెప్పుచున్నాడు. దేవుని వాక్యముతో మన హృదయమును నింపుకొనినప్పుడు మనము తొట్రిల్లుటకు కారణమైన శోధనలను ఎదిరించగలము. దేవుని వాక్యము దొరికినవారికి అవి జీవమైయున్నవి. వాటిని మన హృదయాలలో ఉంచుకొనినప్పుడు మన దేహాలకు అవి ఆరోగ్యమునిచ్చును.ప్రార్ధన:` ప్రియ ప్రభువా, నా మనస్సుకు అధిపతిగా ఉండుము. దుష్ట మరియు దురాశ తలంపులను దూరపరచుకొనుటకు నీ శక్తినిమ్ము. నా సర్వశరీరమునకు జీవమునిచ్చు నీ నిత్యవాక్యముతో నా హృదయము నింపుకొననిమ్ము. అపవాది ఉరులకు తప్పించుకొనునట్లు నా హృదయంలో నీ వాక్యమును భద్రపరచుకొను కృపననుగ్రహించుమని యేసు నామమున వేడుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com




Comments